ఎల్లో మీడియా అంటే ఏమిటి?

ఎల్లో మీడియా అంటే ఏమిటి?

వార్తా పత్రికలు గానీ, టీవీ చానల్స్ గానీ, ఇంకా సోషల్ మీడియా గానీ పనికిరాని చెత్త విషయాలను, అసత్యాలను, పుకార్లను, సంచలనాత్మకంగా, ఆకర్షణీయమైన హెడ్ లైన్స్ తో, పక్షపాత ధోరణితో, వాస్తవాలకు దూరంగా వార్తలను ప్రసారం చేస్తే వాటిని ఎల్లో మీడియా లేదా ఎల్లో జర్నలిజం లేదా ఎల్లో ప్రెస్ అని పిలుస్తారు.

ఎల్లో మీడియా యొక్క ముఖ్య ఉద్దేశ్యం

  • ఒక వ్యక్తికి లేదా ఒక వర్గానికి లేదా ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాయడం.
  • టి ఆర్ పి రేటింగ్ సంపాదించి ఎక్కువ డబ్బులు సంపాదించడం.

జర్నలిజాన్ని (మీడియాని) ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా పిలుస్తారు.

కానీ ప్రస్తుత మీడియాని చూస్తే ఆ స్తంభం కూలిపోవడానికి ఎంతో కాలం పట్టేలా లేదు.

ఒక్కో రాజకీయ పార్టీ తమ స్వంత టీవీ చానెల్స్ ని, వార్త పత్రికలను, సోషల్ మీడియా వింగ్స్ ని స్థాపించుకుంటున్నాయి.

ఎల్లో మీడియాని ఎలా కనిపెట్టాలి?

  • ఏదో ఒక వర్గాన్ని, ఒక రాజకీయ పార్టీని మంచిగా చూపించడం, ఇతర పార్టీలు మంచి చేస్తున్నప్పటికి వాటిని చెడుగా చూపించి, అసత్యాలను ప్రచారం చేస్తాయి.
  • కూలుతున్న దేశ ఆర్ధిక స్థితి, రైతుల సమస్యలు, ప్రజల ఇబ్బందులు వంటి వాటిని పక్కన పెట్టి పనికిరాని చెత్త విషయాలను ఎల్లప్పుడు ప్రసారం చేస్తాయి.

ఎల్లో మీడియాకి ఆ పేరు ఎలా వచ్చింది?

మన రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ యొక్క రంగు యెల్లో కాబట్టి, ఆ పార్టీ యొక్క అనుకూల మీడియానే ఎల్లో మీడియా అని చాలామంది అపోహ పడతారు. ఇది వాస్తవం కాదు.

ఎల్లో మీడియా అనేది మన రాష్ట్రానికో, ఒక రాజకీయ పార్టీ యొక్క అనుకూల మీడియాకో, దేశానికో పరిమితం కాదు. ప్రపంచ దేశాలన్నింటిలో ఈ ఎల్లో మీడియా వుంది.

దాదాపు ప్రతీ రాజకీయ పార్టీ యొక్క అనుకూల మీడియా సంస్థలు ఈ ఎల్లో మీడియా కోవకే చెందుతాయి అనడంలో ఏం మాత్రం సందేహం లేదు.

వాస్తవ కథనాలను ప్రచురించే, ప్రసారం చేసే మీడియా సంస్థలు చాలా తక్కువగా ఉన్నాయి.

1895 – 1898 మధ్య కాలంలో అమెరికాలోని రెండు పత్రికల మధ్య జరిగిన పోటీ నుండి ఎల్లో జర్నలిజం/ఎల్లో మీడియా/ఎల్లో ప్రెస్ అనే పేరు వచ్చింది.

న్యూయార్క్ వరల్డ్ అనే పత్రిక దేశంలో జరిగే విషయాలను విమర్శనాత్మకంగా తెలపడానికి “ఎల్లో కిడ్” అనే కార్టూనుని ప్రచురిస్తూవుండేది.

ఎల్లో కిడ్ కార్టూన్ బాగా ప్రాచుర్యం పొందడం వలన ఆ పత్రిక బాగా పేరును, డబ్బును సంపాదించింది.

దీన్ని గమనించిన పోటీ పత్రిక అయిన న్యూయార్క్ జర్నల్, న్యూయార్క్ వరల్డ్ పత్రికలోని కార్టూనిస్టుని తన పత్రికలోకి తీసుకొని ఎల్లో కిడ్ కార్టూనుని ప్రచురించడం మొదలు పెట్టింది.

న్యూయార్క్ వరల్డ్ పత్రిక వేరే కార్టూనిస్టుతో ఎల్లో కిడ్ కార్టూన్ ని ప్రచురించింది.

ఈ రెండు పత్రికలు పోటా పోటీగా ప్రజల దృష్టిని ఆకర్షించడానికి, ఎక్కువ కాపీలను అమ్ముకోవడానికి ఆకర్షణీయమైన హెడ్ లైన్స్ తో, అవాస్తవాలను ప్రచురించడం మొదలు పెట్టాయి.ఆ విధంగా ఎల్లో జర్నలిజం/ఎల్లో మీడియా/ఎల్లో ప్రెస్ అనే పేరు ఏర్పడింది.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *