Amazon Rain Forest fires explained in Telugu
అమెజాన్ అడవి కాలిపోవడం ప్రపంచానికి ఎందుకు ఆందోళన కలిగిస్తుంది?
అమెజాన్ రైన్ ఫారెస్ట్ దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్ దేశం గుండా ఎక్కువగా వ్యాపించి ఉంది. ఈ అడవి కాలిపోవడం ప్రపంచానికి ఆందోళన కలిగిస్తుంది. నాసా విడుదల చేసిన శాటిలైట్ చిత్రాలను గమనిస్తే పరిస్థితి తీవ్రతను అంచనా వేయవచ్చు.
అమెజాన్ అడవి యొక్క ప్రత్యేకతలేంటో ఈ కింద తెలిపిన అంశాల ద్వారా తెలుసుకోండి.
- ఈ అడవి ప్రపంచంలోని వర్ష అరణ్యాలలో అతి పెద్దది.
- అమెజాన్ అడవిని భూమి యొక్క ఊపిరితిత్తులు అని పిలుస్తారు. ఎందుకంటే ఈ అడవి కర్బన వాయువుని పీల్చుకుని భూమికి కావలసిన ఆక్సిజన్ లో 20 శాతానికి పైగా ఆక్సిజన్ ని అందిస్తుంది.
- అమెజాన్ అడవిలో కొన్ని వందల పురాతన తెగలు నివసిస్తున్నాయి. కొన్ని తెగలైతే ఆధునిక ప్రపంచంతో సంబంధాలు కలిగిలేవు.
- ఎన్నోవేల రకాల జాతుల ఔషధ మొక్కలు, జంతువులు, జీవులు ఈ అడవిలో ఉన్నాయి.
అమెజాన్ అడవి కాలిపోవడానికి గల కారణాలు
- వేసవి కాలంలో పొడి వాతావరణం కారణంగా సహజంగానే ఈ అడవి తగలబడుతోంది.
- ఈ ప్రాంతంలోని రైతులు వ్యవసాయం కోసం అత్యధికంగా అడవిని తగలబెడుతుంటారు.ఇలా ఈ అడవి తగలబడడం ఇప్పుడేమి కొత్త కాదు. అయితే ఇప్పుడు ఆందోళన కలిగించే విషయం ఏంటంటే మునుపెన్నడు లేని విధంగా 2019 వ సంవత్సరంలో 73,000 వేల సార్లు ఈ అడవి తగలబడింది, ఇంకా కాలుతూనే ఉంది.
ఎందుకు ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి?
అమెజాన్ అడవి ఇదే విదంగా భారీ స్థాయిలో కాలిపోతే కొన్నాళ్ళకు పూర్తిగా కనుమరుగు అవుతుంది. దీని ప్రభావం భూమిపై వున్న ప్రపంచ దేశాలపై పడుతుంది.
- వాతావరణంలో కార్బన్ డై ఆక్సయిడ్ శాతం పెరిగి పోవడం వలన గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూతాపం పెరిగి దృవాల వద్ద మంచు కరిగి సముద్ర మట్టం పెరగడం వలన తీరప్రాంత నగరాలూ, పట్టణాలు మునిగిపోతాయి
- వర్షాలు కురవడం తగ్గి కరువులు ఏర్పడతాయి. మనుష్యుల ఆర్ధిక పరిస్థితి కుదేలవుతుంది.
- అమెజాన్ అడవిలోని కొన్ని వందల పురాతన తెగలు నాశనం అవుతాయి.
- కొన్ని వేల రకాల జాతుల ఔషధ మొక్కల సంపద, జంతు సంపద, జీవ వైవిధ్యం దెబ్బతింటుంది.
- వాతావరణంలో సమతుల్యం దెబ్బతిని ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి.
అమెజాన్ అడవి నాశనమైతే భూమిపై నివసించే ప్రతీ జీవి, ప్రతి మానవుడు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తీవ్ర ఇబ్బందులకు గురికావడం వాస్తవం.
అందుకనే ప్రపంచ దేశాలు అంతలా ఆందోళన చెందుతున్నాయి.
ఇటీవల జరిగిన జి 7 (G7 Summit) సదస్సులో సభ్య దేశాలు అమెజాన్ అడవి కార్చిచ్చును ఆపడానికి ఆర్థిక సాయాన్ని ప్రకటించాయి.