World’s First Website: History of World Wide Web(WWW)

ప్రపంచపు మొట్ట మొదటి వెబ్ సైట్ ఏమిటో మీకు తెలుసా?

మనం ఈ రోజు గూగుల్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన సమాచారాన్ని వెదకినపుడు కొన్ని వందల వెబ్ సైట్స్ మనకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తున్నాయి.


షాపింగ్ దగ్గర నుంచి వార్తలు, విద్య, ఉద్యోగ, వ్యాపార, వినోదం వంటి ఎన్నో విషయాలను ఈ రోజు ఇంత సులభంగా తెలుసుకోగలుగుతున్నామంటే దానికి కారణం ఒక శాస్త్రవేత్త స్థాపించిన మొట్ట మొదటి వెబ్ సైట్ మరియు టెక్నాలజీ.

  • ఆ వెబ్ సైట్ అడ్రస్ : info.cern.ch/
  • స్థాపించిన వారు : టిమ్ బెర్నెర్స్ లీ
  • ఎప్పుడు : 1991 వ సంవత్సరంలో
  • ఎక్కడ : సెర్న్ లాబరేటరీ, స్విట్జర్లాండ్

టిమ్ బెర్నెర్స్ లీ (Tim Berners Lee) అనే బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త CERN (European Organization for Nuclear Research) లో పరిశోధనలు చేస్తుండేవారు.

ఆయన లాగే ప్రపంచ నలుమూలల నుండి శాస్త్రవేత్తలు సెర్న్ కోసం పరిశోధనలు చేస్తుండే వారు.


అప్పుడు ఆయన గమనించింది ఏంటంటే ప్రపంచ నలుమూలలలో ఉన్న శాస్త్రవేత్తల దగ్గర పరిశోధన సమాచారాన్ని పంచుకోవడానికి, ప్రాజెక్టులను మేనేజ్ చేయడానికి చాలా కష్టంగా ఉండేది.

అప్పటికి ఇంటర్నెట్ ఉంది. కానీ సమాచారం తెలుసుకోవాలంటే సమాచారమున్న ప్రతి ఒక్క కంప్యూటర్ లోకి లాగిన్ అయి చూడాలి, అలాగే ఒక్కొక్క కంప్యూటర్ లో ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండేది.

ప్రతీ శాస్త్రవేత్త ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లు నేర్చుకోవడం చాలా కష్టంగా ఉండేది.

1989 వ సంవత్సరంలో ఈ విషయాన్ని సెర్న్ దృష్టికి తీసుకెళ్లి, తన వద్ద ఉన్న వరల్డ్ వైడ్ వెబ్ (www – world wide web) అనే ఐడియా ని చెప్పాడు. కానీ ఇది విచిత్రంగా వుంది, సాధ్యపడదు అని చెప్పి బాస్ అంగీకరించలేదు.

మరల 1990 వ సంవత్సరంలో బెర్నెర్స్ లీ మరొక ఇంజనీర్ రాబర్ట్ కైలియాన్ తో కలిసి మళ్ళీ ప్రయత్నం చేయగా, సెర్న్ యాజమాన్యం వరల్డ్ వైడ్ వెబ్ అనే ప్రాజెక్ట్ చేయడానికి అనుమతిని ఇచ్చింది.

అలా బర్నర్స్ లీ స్టీవ్ జాబ్స్ తయారు చేసిన NEXT అనే కంప్యూటర్ సాయంతో వరల్డ్ వైడ్ వెబ్ అనే టెక్నాలజీని కనిపెట్టాడు.

వెబ్ పేజీలను తయారు చేయడానికి HTML (Hyper Text Markup Language) అనే మార్కప్ లాంగ్వేజ్ ని, సమాచారాన్ని పంపించడానికి HTTP (Hyper Text Transfer Protocol) అనే నిబంధనలను (protocols), ప్రతీ వెబ్ పేజీకి, ప్రతీ ఫైల్ కి ఒక అడ్రస్ ని క్రియేట్ చేయడానికి URL (Uniform Resource Locator) అనే విధానాన్ని,

మొత్తం వెబ్ సైట్ యొక్క డేటా ని దాచుకోవడానికి, డేటా ని యూజర్లకు ఇవ్వడానికి సర్వర్ software ని, సమాచారాన్ని వెదకడానికి మొట్ట మొదటి వెబ్ బ్రౌజరు ని ఈయన తయారు చేసారు.

ఆగస్ట్ 6,1991 న వెబ్ సైట్ లైవ్ లోకి వచ్చింది. ఈ విధంగా ప్రపంచం తో సమాచారాన్ని పంచుకోవడం సులభతరం చేసాడు.

ఈయన ఈ అద్భుతమైన టెక్నాలజీ కనిపెట్టడం వలననే Yahoo (1994 లో), Amazon(1995 లో), Ebay(1995 లో), Google(1998 లో), Facebook(2004 లో) వంటి ఎన్నో పేరుగాంచిన వెబ్ సైట్స్ పుట్టుకొచ్చాయి.

అందుకనే టీమ్ బెర్నెర్స్ లీ ని “ఫాదర్ అఫ్ వరల్డ్ వైడ్ వెబ్” గా పిలుస్తారు.

ఈయన కనిపెట్టిన ఈ అద్భుత మైన టెక్నాలజీ నుండి డబ్బుని సంపాదించాలనుకోలేదు. సెర్న్ యాజమాన్యం ఈయనను ఈ టెక్నాలిజీకి పేటెంట్ ని పొందామని కోరింది. దానికి ఆయన ఒప్పుకోలేదు.

ఉచితంగా అందరికి అందుబాటులో ఉండడం వలన మానవ జాతికి లాభం చేకూరుతుందని, వరల్డ్ వైడ్ వెబ్ ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందని భావించారు.

ప్రపంచపు మొట్ట మొదటి వెబ్ సైట్ ని ఈ లింక్ క్లిక్ చేసి http://info.cern.ch/ చూడవచ్చు.

“Necessity is the mother of invention” అవసరం మనిషి చేత ఆవిష్కరణలు చేయిస్తుంది. అనే సామెత ఈయన విషయంలో మళ్ళీ రుజువయ్యింది.

ఇతరులకు షేర్ చేయండి

3 thoughts on “World’s First Website: History of World Wide Web(WWW)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *